భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి తదితర ప్రముఖులు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో అధికారుల పర్యవేక్షణలో ట్రయల్ ల్యాండింగ్ కార్యక్రమం నిర్వహించారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో ఈ విమానాశ్రయం రూపొందించబడింది. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం దీని ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం జరగడంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.

ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థ జీఎంఆర్ జూన్ నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.