తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ సమయంలో మాట్లాడిన రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు జరిగిన క్లోజ్ రూమ్ సంభాషణ గురించి ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టిందని, ప్రతి రోజు 3 టీఎంసీల నీటిని వినియోగించాలని అనుకుందని రేవంత్ చెప్పారు.
అయితే, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏదైన విషయాల మీద చర్చ జరగాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని తాను చంద్రబాబును కోరానని రేవంత్ అన్నారు. తమ మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు ఆపేశారని, అది తాను సాధించిన విజయమని అన్నారు.
రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగాయా లేదా వెళ్లి చూసుకోవాలని, కేసీఆర్ లేదా హరీష్ రావులతో నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. జగన్ ను ఇంటికి పిలిచి పంచభక్ష పరవాణ్ణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు 3 టీఎంసీలు ఇచ్చి కమిషన్లు తీసుకున్న చరిత్ర వాళ్లదని కేసీఆర్, హరీష్ లనుద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ను భుజం తట్టి వెన్ను తట్టి ప్రోత్సహించారని చెప్పారు. వారి చరిత్ర అదని, వారి నీతి అది అని అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలన్న ఉద్దేశ్యంతో తాను సాధించిన విజయాలను ఇన్నాళ్లూ బయటపెట్టలేదని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన తాను చంద్రబాబును కాదనుకొని…ఆ పార్టీని కాదని వదులుకొని…కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలను ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రిని అయ్యానని గుర్తు చేశారు. అటువంటి తాను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తానా అని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates