సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను…తెలంగాణ శాసన సభలో బీఆర్ఎస్ సభ్యులనుద్దేశించి స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. దీంతో, ఆ కామెంట్లకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వబోనని స్పీకర్ ఇలా చెప్పడం భారత దేశ చరిత్రలో ఏ సభలోనూ ఈ రకంగా స్పీకర్ రూలింగ్ ఇవ్వలేదని, ఇదే తొలిసారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
ముఖ్యమంత్రిని పొగడాలని, విమర్శిస్తే మైక్ ఇవ్వబోనని స్పీకర్ చెప్పడం ఏంటని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆ రకంగా సభా నిబంధనలు లేవని, తమ ఇష్టం వచ్చినట్లు నిబంధనలు పెడతామని కాంగ్రెస్ నేతలు అనుకోవడం సరికాదని హితవు పలికారు. సభ సజావుగా నడపడం స్పీకర్ విధి, బాధ్యత అని…ఆయనకు కూడా నిబంధనలుంటాయని గుర్తు చేశారు.
సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల సమాన హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ దేనని అన్నారు. ఆ విషయం మరచిపోయి ఏకపక్షంగా కాంగ్రెస్ సభ్యులకు స్పీకర్ మద్దతిచ్చారని, అందుకు నిరసనగానే సభను బాయ్ కాట్ చేసి వాకౌట్ చేశామని చెప్పారు.
అయితే, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పడంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి కేవలం సబ్జెక్ట్ కు మాత్రమే పరిమితం కాకుండా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నప్పుడు స్పీకర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని, ఆయన మైక్ ఎందుకు కట్ చేయలేదని వారు ట్రోల్ చేస్తున్నారు. ఇలా చేయడం స్పీకర్ పదవిని దుర్వినియోగం చేయడమేనని విమర్శిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates