మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత శాసన సభలో అడుగుపెట్టిన కేసీఆర్ పది నిమిషాలు కూడా సభలో ఉండలేదని, కేవలం అటెండెన్స్ కోసమే వచ్చారని ఆరోపిస్తున్నారు.
ఈ అంశంపై తాజాగా కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. తప్పులు జరిగితే వాటిపై మాట్లాడేందుకు కేసీఆర్ తప్పకుండా సభకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
అలాగే హరీష్ రావు, ఇతర నాయకులు సభను వదిలి వెళ్లొద్దని, సభా సమయాన్ని వృథా చేయకూడదని కవిత సూచించారు. హరీష్ రావుకు కమిషన్లు తీసుకోవడం, అమ్మడం తప్ప మరేమీ తెలియదని ఆమె విమర్శించారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష సరికాదని, కేసీఆర్ ను ఉరి తీయాలని రేవంత్ అంటున్నారని, అలా అయితే రేవంత్ ను పదిసార్లు ఉరి తీయాలని కూడా కవిత వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, కవిత మండలి ఛైర్మన్ ను కలిశారు. ఆమె సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాజీనామా ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. రాజీనామా ఆమోదించకముందే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం.
గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తాను సందర్శించిన విషయాలను సభలో ప్రస్తావించాలనే ఉద్దేశంతో కవిత ఈ అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది. తనను పిలిస్తే సిట్ కు అన్ని ఆధారాలు ఇస్తానని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అభ్యర్థనపై మండలి ఛైర్మన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates