ఫిబ్రవరి 1 నుంచి ఒక్క సిగరెట్ ధర రూ.72కు పెరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20 మధ్య ఉన్న సిగరెట్ ధర ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరుగుతుందన్న ప్రచారం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను నిర్మాణాన్ని అమలు చేయనుంది. సిగరెట్లపై 40 శాతం జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. అలాగే బీడీలపై 18 శాతం జీఎస్టీతో పాటు ఆరోగ్య సెస్, జాతీయ భద్రత సెస్, అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ వర్తించనుంది. ఈ పన్నుల ప్రభావంతో పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనున్నట్టు స్పష్టమవుతోంది.
అయితే, ఒక్క సిగరెట్ ధరను ఖచ్చితంగా రూ.72గా ప్రభుత్వం నిర్ణయించిందన్నది నిజం కాదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏ అధికారిక ప్రకటనలోనూ ఒక్క సిగరెట్ ధర రూ.72గా నిర్ధారించలేదు. కొంతమంది విశ్లేషకులు, వార్తా సంస్థలు పన్నుల భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపితే ధరలు ఆ స్థాయికి చేరవచ్చని అంచనా వేయడమే ఈ ప్రచారానికి కారణంగా తెలుస్తోంది.
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రూ.72 అనే ధర ఇప్పటివరకు అంచనామాత్రమే. వాస్తవ ధరలు ఎంత పెరుగుతాయన్నది ఆయా సిగరెట్ కంపెనీలు విడుదల చేసే అధికారిక ధరల జాబితాలపై ఆధారపడి ఉండనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates