ఆ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వైసీపీ హయాంలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవడం మొదలు పొలాల రీ సర్వే చేయడం వరకు జగన్ చేసిన పనులకు ప్రజలు తమ భూములు కోల్పోతామేమోనని భయపడ్డారు.

అయితే, కూటమి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. దాంతోపాటు రాష్ట్రంలోని మరో 4 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించబోతున్నామని తెలిపింది. రైతులకు కొత్త సంవత్సర కానుక ఇస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు ఉపేక్షించవద్దని, దానిని సుమోటోగా తీసుకోవాలని ఆదేశించారు. సైనిక, మాజీ సైనిక ఉద్యోగుల, స్వాతంత్య్ర సమరయోధుల భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు, భూ యాజమానుల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల భూములకు రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.