ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను రెచ్చగొట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక వైసీపీ హస్తం ఉందన్నారు.
సినీరంగానికి చెందిన వారితో పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా వ్యవహారిస్తున్నారని.. అయితే.. పవన్ కల్యాణ్ ఒక విజనరీ నాయకుడితో పని చేస్తున్నాం అని అర్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారన్నారు.
ఇక, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని.. అయినా.. చంద్రబాబు సమర్థవంతంగా వాటిని గాడిలో పెడుతున్నారని తెలిపారు.
“వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది. దీనిని సరిచేసేందుకు ఏడాది సమయం పట్టింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి గాడిలో పడుతోంది. అయినా.. వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోంది. రాష్ట్రాన్ని బాగుచేస్తుంటే చూడలేకపోతున్నారు“ అని తనదైన శైలిలో గోరంట్ల వ్యాఖ్యానించారు.
జగన్ హయాంలో ఓ నియంతమాదిరిగా వ్యవహరించారని దుయ్యబట్టారు. జగన్ మాయలో పడి.. ఆయన చెప్పినట్టు చేసినవారు.. ఆయన మెప్పుకోసం నోరు పారేసుకుని.. వ్యాఖ్యలు చేసిన వారు..ఇప్పుడు రాష్ట్రం వదిలి పారిపోయారని.. పరోక్షంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
“నేను అప్పట్లోనే హెచ్చరించా. వంశీ, నాని(కొడాలి)లు.. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించా. ప్రభుత్వం ఎప్పుడూ ఒక్కటే ఉండదని చెప్పా. ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని కూడా తెలిపాను. అయినా.. వారు నా మాట వినలేదు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఫలితంగా.. ఇప్పుడు నోరు ఎత్తలేని పరిస్థితి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఉండలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. “ అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎవరైనా బాధ్యతగా ఉండాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates