తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో సహా ఏపీకి వచ్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు.. కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు.. సహా స్థానిక ఎమ్మెల్యేలు.. పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా ఎస్. వెంకటేశ్వర్ సహా.. పలువురు అధికారులు కూడా రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు.
గతానికి భిన్నం..
వాస్తవానికి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. బీ-కేటగిరీ ప్రొటోకాల్ అమలు చేస్తారు. అంటే.. వారికి జాయింట్ కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు.. మాత్రమే స్వాగతం పలుకుతారు. స్థానికంగా వారి వారి పార్టీలకు చెందిన నాయకులు ఉంటే వారు వచ్చి హల్చల్ చేస్తారు. ఇది .. ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ., గతంలోనూ రేవంత్ రెడ్డి ఒకసారి తిరుపతికి, ఒకసారి విశాఖకు వచ్చినప్పుడు కూడా ఇలానే జరిగింది.
కానీ.. తొలిసారి దానికి భిన్నంగా.. టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు, మరో మంత్రి పయ్యావుల కేశవ్ సహా ఎమ్మెల్యేలు.. పులవర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి వంటివారు ఎదురేగి స్వాగతం పలకడం గమనార్హం. విమానాశ్రయానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా చేరుకున్నాయి.
దీంతో రేవంత్‌రెడ్డి.. ఇంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణం ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ-తెలంగాణల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దరిమిలా .. ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
ఎందుకు వచ్చారంటే..
ఇక, కుటుంబంతో సహా తిరుపతికి తెలంగాణ ముఖ్యమంత్రి రావడం వెనుక.. వైకుంఠ ఏకాదశే కారణం. మంగళవారం.. వైకుంఠ ఏకాదశి పర్వదినం. దీనిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం గుండాదర్శించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు.
విమానాశ్రయంలో ఆయన తన మనవడిని ఎత్తుకునే కనిపించారు. ఆయన కుమార్తె, సతీమణి, అల్లుడితోపాటు తిరుపతికి చేరుకున్న ఆయన.. అనంతరం.. ప్రత్యేక వాహన శ్రేణిలో తిరుమలకు వెళ్లారు. మంగళవారం ఉదయం తొలి 10 నిమిషాల్లోనే(వాస్తవానికి సోమవారం రాత్రి 2 గంటల నుంచే తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది) దర్శనం చేసుకోనున్నారు. అందుకే.. తెలంగాణ సీఎం తిరుపతికి విచ్చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates