రాయచోటి జిల్లా కేంద్రం మార్పు అంశం ఏపీ క్యాబినెట్ సమావేశంలో భావోద్వేగానికి దారితీసింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పాటవుతున్న మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాయచోటి అభివృద్ధి, ప్రజల భావోద్వేగాలను పరిగణన లోకి తీసుకోవాలని ఆయన క్యాబినెట్‌లో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాం ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రిని ఓదార్చారు. జిల్లా కేంద్రాన్ని యథాతథంగా కొనసాగిస్తే ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా ఇబ్బందులను ఆయన వివరించారు. రాయచోటి అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని, ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పోరాడుతున్నారని తెలిపారు
ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఉందని సీఎం వివరించారు. ఇదిలా ఉండగా, జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటు చేయనుండగా, వాటితో కలిపి రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి చేరనుంది. ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే, 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్యాబినెట్, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపడానికి కూడా ఆమోదం తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates