సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే హనుమానే గొప్ప

తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ ను ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలోనే వారితో కలిసి ఆ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్‌లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్ప వారని, ఆ విషయాన్ని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు.

సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని….బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహా యోధుడని వారికి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, కృష్ణుడు, మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలని అన్నారు.

ప్రపంచంలో శ్రీరాముడిని మించిన పురుషోత్తముడు లేడని వారికి వివరించాలని చెప్పారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని పిల్లలకు చెప్పాలని, బకాసురుడు, కంసుడు వంటి రాక్షసుల గురించి చెబితేనే మన పిల్లలకు మంచి, చెడుల మధ్య వ్యత్యాసం తెలుస్తుందని అన్నారు.

మైథాలజీ గురించి అందరూ మరిచిపోతున్నప్పుడు ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మళ్లీ విలువల గురించి సమాజానికి తెలియజేశారని అన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. యోగా ద్వారా యూనివర్సల్ హెల్త్‌ను మన దేశం అందించిందని తెలిపారు.

ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. సౌర, పవన విద్యుత్తుపై అధికంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఆరు నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి ఆపరేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయడానికీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.