ఏపీ ప్రతిపక్షం (ప్రధాన కాదు) వైసీపీ విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెడికల్ కాలేజీల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంపై ఆ పార్టీ చేస్తున్న నిరసనలు, ధర్నాలు, కోటి సంతకాల సేకరణ వంటి అంశాలపై బుధవారం రాత్రి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు.
పీపీపీ విధానంలో ఎవరు ఎలాంటి యాగీ చేసినా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, అధికార పక్షం నాయకులు, అధికారులు కూడా ప్రజలకు పీపీపీ విధానంలో జరిగే మేళ్లను వివరించాలన్నారు.
పీపీపీ విధానం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదే కాకుండా కేంద్రం కూడా దీనికి మద్దతు ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విధానంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 30:30 చొప్పున నిధులు ఇస్తాయని, వైయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను కూడా కేంద్రం అందిస్తుందని తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులకు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోనే నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా సహించేది లేదన్నారు.ఇంచ్ కూడా వెనక్కి తగ్గేది లేదు. రాజీ పడేది అంతకంటే కూడా లేదు. పీపీపీ విధానంలోనే పేదలకు మేలు జరుగుతుంది. వారికి మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన విద్య కూడా అందుతాయి.
ఈ విషయంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ పరమైన విషయాలను రాజకీయంగానే తాము తేల్చుకుంటామని, అధికారులు మాత్రం ప్రభుత్వ విధానాలకు కట్టుబడి పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టం చేశారు.
అన్నీ పీపీపీలోనే
ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోనే నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తొలి దశలో ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లెలోని మెడికల్ కాలేజీలను పీపీపీలో నిర్మించాలన్నారు.
ఆదోనికి ఒక సంస్థ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. మిగిలిన ఆసుపత్రుల విషయంలో కూడా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని, మరోసారి బిడ్డర్లతో చర్చలు జరపాలన్నారు. అలాగే రెండో దశకు సంబంధించిన ఆసుపత్రుల అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates