డిసెంబర్ 21 వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు. నేటితో ఆయన 53వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం కామనే. కానీ ఒక నాయకుడిగా జగన్‌ను చూసినప్పుడు ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో, అంతే ఎత్తు నుంచి కిందికి జారిపోవడం జగన్ జీవితంలో కీలక అధ్యాయమే అని చెప్పాలి. నేతగా సఫలమైన జగన్, అదే నేతగా విఫలం కూడా అయ్యారు.
2011లో కాంగ్రెస్‌తో విభేదించినప్పుడు జగన్ వల్ల ఏమవుతుందనే అనుమానం కాంగ్రెస్ నాయకుల్లో ఉండేది. కానీ ఆ తర్వాత పరిణామాల్లో అదే కాంగ్రెస్‌ను కాదని, సొంత పార్టీ పెట్టుకుని (2011 మార్చి 12) స్వల్ప కాలంలోనే విజయం దక్కించుకున్నారు.
2014 ఎన్నికల నాటికి, అంటే కేవలం మూడేళ్లలోనే విభజిత ఏపీలో 67 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసి, అప్పటి ఎన్నికల్లో 151 స్థానాలతో కనీవినీ ఎరుగని విజయం సాధించారు. నేతగా జగన్ సక్సెస్ అయ్యారు.
అనేక మంది పార్టీలో చేరినా, అంతే సంఖ్యలో పార్టీ నుంచి బయటకు వచ్చినా, చెక్కుచెదరని పట్టుదలతో ముందుకు సాగారు. అత్యంత స్వల్ప వ్యవధిలో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్, కాలం కళ్లముందు తిరగకుండానే అంతే పతనం అయ్యారు.
2019–24 మధ్య ఆయన పాలనలో మంచి పనులు చేయలేదా అంటే చేశారన్నది ప్రత్యర్థులు సైతం అంగీకరించిన విషయం. అయితే రాజకీయ కక్ష సాధింపు, ఆశ్రిత పక్షపాతం, కుల రాజకీయాలు, పెంకితనం కలిసి జగన్‌లోని నాయకత్వ లక్షణాలను దెబ్బతీశాయి. ఇది ఆయన కోరి తెచ్చుకున్న పరాజయమని పరిశీలకులు అంటున్నారు.
అధికారంలో లేనప్పుడు ఒకలా, ఉన్నప్పుడు మరోలా వ్యవహరించిన జగన్ ప్రజలకు దూరమయ్యారు. ఫలితంగా 2024లో ఊహించని విధంగా 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఈ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నంలో జగన్ ఇప్పటికీ తడబడుతున్నారన్నది కీలక విశ్లేషణ.
భవిష్యత్తుపై ఆశలు
భవిష్యత్తుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న జగన్, దానికి అనుగుణంగా తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మంకు పట్టుదల కొన్ని సందర్భాల్లో కలిసి వచ్చినా, అదే ప్రధాన ఇబ్బందిగా మారుతోంది.
ప్రధాన ప్రతిపక్ష హోదా లేదన్న కారణంతో అసెంబ్లీకి దూరంగా ఉండటం, నాయకుల విషయంలో మొండిగా వ్యవహరించడం, కీలకమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి.
నాయకుడిగా ఒకప్పుడు సఫలమైన జగన్, తన నాయకత్వ లక్షణాలకు పదును పెట్టుకుని, పరిస్థితిని అర్థం చేసుకుని రాజకీయాలు చేయకపోతే, విఫలమైన బాటలోనే నడవాల్సి వస్తుందన్న నిష్టూర సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates