కాంగ్రెస్ ప్రభుత్వ సారథి, సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత.. బీఆర్ ఎస్ భవన్‌కు వచ్చిన ఆయన ఆదివారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి ప్రభుత్వ విధానాల వరకు అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. అదేసమయంలో తమ హయాంలో ఏం చేశారో.. ప్రస్తుతం ఏం జరుగుతోందో కూడా వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం లడాయి పెట్టుకునే విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
తాము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా..ఎప్పుడూ అహంకారం ప్రదర్శించలేదన్న కేసీఆర్.. ప్రస్తుతప్రభుత్వం మిడిసి పడుతోందంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అహంకారాన్ని తొక్కిపెట్టారని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి..మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. ప్రతి విషయంలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసినట్టు వివరించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరగకపోయినా.. ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారన్నారు.
అదే పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగి ఉంటే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరేగా ఉండేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ మద్దతు దారుల విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కేసీసార్ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో మిడిసి పడే కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధిచెప్పారని.. తాము అధికారంలో ఉన్నప్పుడు.. ఎప్పుడూ ఇంత అహంకారంతో పేట్రేగలేదని చెప్పారు. ఇక, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కేసీఆర్ ఖండించారు. “నేను చచ్చిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వ విధానాలే అంత“ అంటూ.. దుయ్యబట్టారు. ఫ్లో లో అయిన సీఎం రేవంత్ పేరును పలకడానికి నిరాకరించిన కేసీఆర్, ఇప్పటికీ రేవంత్ ను తన ప్రథమ ప్రత్యర్థిగా చూడట్లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మా కన్నా మెరుగేదీ?
బీఆర్ ఎస్ హయాంలో తెచ్చిన పథకాలు.. విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగిస్తోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా.. కొత్త పాలసీని తెచ్చారా? అని నిలదీశారు. హైడ్రా తెచ్చి.. ప్రజల నడ్డి విరిచారని అన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే.. ఫ్యూచర్ సిటీ పాలసీని ప్రకటించారని విమర్శించారు. దీని వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు లబ్ధి చెందుతారని.. కానీ.. ప్రజల ఆస్తుల విలువ మాత్రం పెరగదని.. పైగా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. రైతులు ఘోష పడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. తమ హయాంలో ఇంటికే చేరిన యూరియా కోసం.. ప్రస్తుతం లైన్‌లలో నిలబడే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates