ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గోదావరి ప్రాంతం ఈ మధ్య దెబ్బ తినడానికి రాష్ట్ర విభజన పరోక్ష కారణమని.. ఆ ప్రాంతానికి తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఇటీవల మాటల మధ్యలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. తెలంగాణ మంత్రులు సహా ఆ ప్రాంత నాయకులు పలువురు పవన్ మీద మండిపడ్డారు. తెలంగాణ ప్రజానీకానికి పవన్ క్షమాపణలు చెప్పాలన్నారు.
ఐతే ఈ విమర్శలపై పవన్ స్పందించలేదు. తన మాటల్ని వక్రీకరించవద్దని మాత్రమే అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ మీద తన ప్రేమను చాటుకున్నారు పవన్. తాను ఎంతో ప్రత్యేకంగా భావించే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భారీ మొత్తంలో సాయం అందేలా పవన్ కీలక పాత్ర పోషించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.35.19 కోట్లఆర్థిక సాయం అందించబోతోంది. ఇది పవన్ చొరవతోనే జరుగుతుండడం గమనార్హం.
కరీంనగర్ కొండగట్టు ఆంజనేయస్వామి తనకు పునర్జన్మను ఇచ్చారని పవన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల ముంగిట ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు కొండగట్టులో హై టెన్షన్ వైర్లు తగిలి పవన్ ప్రాణం కోల్పోయే పరిస్థితి ఎదుర్కొన్నారు. త్రుటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అందుకు కృతజ్ఞతగా పలుమార్లు ఆయన కొండగట్టును సందర్శించారు.
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా కొండగట్టుకు వెళ్లారు. ఐతే భక్తుల కోసం ఇక్కడ సరిపడా గదులు లేవని అక్కడి ఆలయ నిర్వాహకులు పవన్‌కు విన్నవించారు. దీంతో వేరే రాష్ట్రం అని హద్దులు పెట్టుకోకుండా టీటీడీ అధికారులతో ఈ విషయమై మాట్లాడారు. అక్కడ వసతి భవనాలు నిర్మించడానికి, 35.19 కోట్ల సాయానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.
అమరజీవి జలధార ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ ఈ మేరకు ప్రకటన చేశారు. కొండగట్టు ఆలయానికి ఆర్థిక సాయం అందించాడానికి ముందుకు వచ్చిన టీటీడీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates