కాస్తా కూస్తా కాదు ఏకంగా ఐదేళ్ళు మంత్రిగా అపరిమితమైన అధికారాలు చెలాయించారు. అయితే సీన్ తిరగబడటంతో గడచిన ఏడాదిన్నరగా ఎక్కడా కనబడటం లేదు సరికదా ఎవరికీ అందుబాటులో కూడా ఉండటం లేదట. ఇదంతా ఎవరి గురించనుకుంటున్నారా అవును, ఆయనే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. మంత్రిగా ఉన్నపుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం జిల్లాలోనే ఓ విధంగా చక్రం తిప్పారు. కానీ తాను ఓడిపోవటమే కాకుండా పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి దాదాపు హైడ్ అవుట్ లోనే ఉండిపోతున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
రాజధాని అమరావతి కేంద్రంగా గడచిన ఏడాదిన్నరలో టీడీపీ చాలానే నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఏ కార్యక్రమంలో కూడా ప్రత్తిపాటి కనబడలేదు. నేతలతో చంద్రబాబునాయుడు నిర్వహించిన జూమ్ యాప్ కాన్ఫరెన్సుల్లో కూడా ఈ మాజీ మంత్రి ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదట. మరి పార్టీ అధినేతను కలవక, జిల్లా నేతలతోను టచ్ లో లేక ఏమైపోయారో ఎవరికీ అర్ధం కావటం లేదు. చివరకు నియోజకవర్గంలో నేతలకు కూడా ఎక్కడా కనబడటం లేదని సమాచారం.
ఎందుకింతగా అజ్ఞాతంలో గడుపుతున్నారన్న విషయాన్ని ఆరా తీస్తే ఆయనపై ఉన్న కేసుల నుండి బయటపడటానికే అని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. టీడీపీ హయాంలో విలేజ్ మాల్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ ఫెయిల్ అయినా డబ్బులు మాత్రం బాగానే చేతులు మారాయట. ఈ వ్యవహారంలో ప్రధాన భాగం ప్రత్తిపాటికే అందాయనే ఆరోపణలున్నాయి లేండి. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ ఆరోపణలపై విచారణ చేయిస్తున్నారు. విచారణ చివరదశకు వచ్చేసిందట.
ఇదేకాకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా జరిగిన పత్తి కొనుగోలులో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని దాదాపు నిర్దారణైందట. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణలో ప్రత్తిపాటి అవినీతికి ఆధారాల కూడా దొరికాయట. ఇలాంటి అనేక కారణాలతో పాటు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు జైలుకు వెళ్ళిన కారణంగా తనకు ఆ పరిస్దితి రాకుండా ముందు జాగ్రత్తగానే హైడ్ అవుట్లోనే గడిపేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఓ దశలో ప్రత్తిపాటి వైసీపీలో చేరబోతున్నారని కాదు కాదు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇంత వరకు ఈయన ఏ పార్టీలోను చేరలేదు. అలాగని టీడీపీలో యాక్టివ్ గా కూడా లేరు. మరి ఇలా ఎంతకాలం నెట్టుకొస్తారో ఏమో చూడాల్సిందే.