ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డు లభించడం పట్ల ఏపీలోని టీడీపీ నాయకులు, శ్రేణులు, ప్రభుత్వ వర్గాలు, మంత్రులు.. అధికారులు సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక, నారా వారి కుటుంబం అయితే.. సంతోషంలో మునిగి తేలుతోంది. మంత్రి లోకేష్ నుంచి ఆయన సతీమణి, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, సతీమణి భువనేశ్వరి కూడా సంతోషం వ్యక్తం చేశారు.
కానీ, చంద్రబాబు మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. సత్కారాలు, సన్మానాల కోసం తాను ఎప్పుడూ వెంపర్లాడలేదని చెప్పారు. తాను ఎప్పుడూ పనిచేసుకుని పోవడంలోనే సంతోషం, ఆనందం అనుభవిస్తానని చెప్పారు. తన పాలన పట్ల, పనితీరు పట్ల ప్రజలు వ్యక్తం చేసే సంతృప్తే.. `సత్కారం`గా భావిస్తానని చెప్పారు. గతంలోనే తన పనితీరును మెచ్చి విదేశీ యూనివర్సిటీల నుంచి దేశీయ విశ్వవిద్యాలయాల వరకు డాక్టరేట్లు ప్రదానం చేసేందుకు ముందుకు వచ్చినట్టు తొలిసారి ఆయన వెల్లడించారు.
అయితే.. తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ప్రస్తుతం ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకటించిన `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025` వంటి సత్కారాలను తాను ఎప్పుడూ గతంలో తీసుకోలేదన్నారు. ఈ అవార్డు ప్రకటించడం పట్ల పత్రిక యాజమాన్యానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి అధికారులు చేసిన కృషి, మంత్రుల సహకారం.. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఉన్న మద్దతే కారణమని చంద్రబాబు సవినయంగా పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates