రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ దానిని పూర్తి చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఏపీ మాజీ సీఎం జగన్ కలిశారు. వైసీపీ నేతలు సేకరించిన కోటి సంతకాల ప్రతులను లోక భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ అందించారు.
మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని జగన్ అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే జరిగే నష్టాలను గవర్నర్ కు వివరించామన్నారు. ప్రజల నిరసనలకు సంబంధించిన ఆధారాలతోపాటు కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించామన్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య విద్యను అందించాలని, వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు.
అంతకుముందు, కోటి సంతకాల ప్రతులతో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు తాడేపల్లి చేరుకోగా…వాటికి జగన్ పచ్చజెండా ఊపారు. అయితే, ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంపై కూటమి పార్టీల నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే సంతకాలు చేసి కార్యక్రమం ముగించారని ఆరోపిస్తున్నారు.
ప్రజలు సంతకాలు చేసిన శాతం చాలా తక్కువ అని అంటున్నారు. ప్రజల నుంచి మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడంపై వ్యతిరేకత లేదని, వైసీపీ కృత్రిమంగా క్రియేట్ చేసిన వ్యతిరేకత మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంపై ఎటువంటి అభ్యంతరం తెలపని విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. దీంతో, జగన్ కోటి సంతకాల కృషి ఫలిస్తుందా? ఈ కార్యక్రమం ముగిసింది కాబట్టి..ఆయన తదుపరి కార్యచరణ ఏంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates