వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు ఉండ‌గా.. ఏరికోరి సీఎం చంద్ర‌బాబుకు మాత్ర‌మే ఈ అవార్డు ఎలా ద‌క్కింది? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. ప్ర‌స్తుతం దేశంలో అభివృద్ధిలో ముందుకు సాగుతున్న రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర ముందంజ‌లో ఉన్నాయి. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు కూడా పోటీ ప‌డుతున్నాయి. మ‌రోవైపు తెలంగాణ కూడా ఈ జాబితాలో ముందుంది.

అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు అన్ని రాష్ట్రాల‌ను కాద‌ని.. వ్యాపార సంస్క‌ర్త‌-2025గా ఎలా నిలిచారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం. ప్ర‌ధానంగా ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న‌త శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి ఇక్క‌డ లేక‌పోవ‌డం కీలకం. అదేవిధంగా ఉత్త‌రప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌ల ముఖ్య‌మంత్రులు చివ‌రి వ‌ర‌కు కూడా.. ఈ అవార్డు విష‌యంలో పోటీ ఇచ్చారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నారు. పెట్టుబ డులు.. మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. దీంతో ఈ అవార్డు విష‌యంలో ఆయ‌న ముందంజ‌లోనే ఉన్నారు.

ఇక‌, మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ కూడా.. పెట్టుబ‌డుల క‌ల్ప‌న‌కు.. ప్ర‌జ‌ల మౌలిక స‌దుపాయాలకు ప్రాధాన్యం పెంచారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా బ‌ల‌మైన పోటీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. యూపీ లో బుల్ డోజ‌ర్ సంస్కృతి కార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ అనిశ్చితి కొన‌సాగుతోంది. దీంతో ఆ రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్వ‌ల్ప తేడాతో వెనుక‌బ‌డ్డారు. ఇది చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును సొంతం చేసింద‌ని ఎక‌నమిక్ టైమ్స్ వెల్ల‌డించింది.

బాబుకు ఎదురు లేదు!

పెట్టుబ‌డుల క‌ల్ప‌న ద్వారా రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగ‌, ఉపాధులు క‌ల్పించాల‌ని సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యంగా పెట్టుకోవ‌డాన్ని అవార్డు ప్ర‌క‌టిత ఎక‌న‌మిక్‌ టైమ్స్ ప్ర‌క‌టించింది. అదేస‌మ‌యంలో వివాద ర‌హితంగా పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం.. భూములు స‌మీక‌రించ‌డం.. భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల మేర‌కు సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేసే విష‌యంలోనూ చంద్ర‌బాబు ముందున్నార‌ని తెలిపింది. ఈ విష‌యాల్లో ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వెనుకంజ వేసిన‌ట్టు పేర్కొంది. అందుకే వ్యాపార సంస్క‌ర్త‌గా చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో నిలిచార‌ని వివ‌రించింది.