లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన `విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫ‌ర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిష‌న్ -గ్రామీణ్‌(వీబీ జీ-రామ్‌జీ) బిల్లును గురువారం స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. అయితే.. దీనిని నిర‌సిస్తూ.. విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌నకు దిగాయి. బిల్లు ప్ర‌తుల‌ను చించేసి.. లోక్‌స‌భ‌లో వెద‌జ‌ల్లాయి. అంతేకాదు.. స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టి నినాదాల‌తో హోరెత్తించాయి. అయినా.. కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌లేదు. చేతులు ఎత్త‌డం ద్వారా ఓటింగ్ నిర్వ‌హించి బిల్లును ఆమోదించుకుంది.

ఏంటా బిల్‌..?

2004-05 మ‌ధ్య అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం పేరును తాజాగా మోడీ స‌ర్కారు మార్చింది. వాస్త‌వానికి ఇది ప్ర‌భుత్వ ప‌థ‌క‌మే అయినా.. అప్ప‌ట్లో చ‌ట్టం చేశారు. ప్ర‌భుత్వాలు మారినా.. దీనిని కొన‌సాగించాల‌న్న స‌దుద్దేశంతో అప్ప‌ట్లో దీనిని రూపొందించారు. ఈ కార‌ణంగానే మోడీ స‌ర్కారు ఇన్నేళ్లు ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించింది. అయితే.. తాజాగా యూపీఏ ప్ర‌భుత్వం పెట్టిన పేరును మార్చాల‌ని మోడీ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో `జాతిపిత బాపూజీ` పేరును తొలుత జోడించారు.

కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎద్దేవా రావ‌డంతో అస‌లు పూర్తిగా మ‌హాత్ముడి పేరును తీసేసి.. మోడీ ప్ర‌వ‌చిస్తున్న `విక‌సిత్ భార‌త్‌` పేరుతో దీనిని రూపొందించారు. అంతేకాదు.. `రాముడి` పేరు వ‌చ్చేలా ఈ ప‌థ‌కం పేరును నిర్ధారించారు. ఇది ర‌చ్చ‌కు దారి తీసింది. మ‌హాత్ముడి పేరును తీసేయ‌డాన్ని విప‌క్షాలు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాయి. ఇలా చేయ‌డం అంటే.. మ‌హాత్ముడిని రెండో సారి హ‌త్య చేసిన‌ట్టేన‌ని వ్యాఖ్యానించాయి. అయిన‌ప్ప‌టికీ కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు.

గురువారం స‌భ ప్రారంభం కాగానే.. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌.. ఈ బిల్లును లోక్‌స‌భ‌లో స‌మ‌ర్పించారు. అనంత‌రం దీనిపై చ‌ర్చ‌ను ఆయ‌న ప్రారంభించారు. మ‌హాత్ముడి ఆశ‌యాల‌ను మోడీ స‌మ‌ర్థిస్తున్నార‌ని.. అందుకే.. స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. క‌రెన్సీ నోట్ల‌పైనా స్వ‌చ్ఛ భార‌త్ చిహ్నాన్ని ఏర్పాటు చేశార‌న్నారు. కాంగ్రెస్ పార్టీనే మ‌హాత్ముడిని అవ‌మానించింద‌న్నారు. మొత్తంగా రెండు గంట‌ల పాటు తీవ్ర విమ‌ర్శ‌లు, నిర‌స‌న‌లు, నినాదాల‌తో లోక్‌స‌భ‌లో ర‌చ్చ జ‌రిగింది. చివ‌ర‌కు.. బిల్లును ఆమోదించారు.