ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు. ఈ అవార్డును ఏటా ప్రముఖ ఇంగ్లీష్ డైలీ.. ఎకనమిక్ టైమ్స్ ఇస్తుంది. ఈ ఏడాది సీఎం చంద్రబాబును ఈ అత్యుత్తమ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం విశేషం. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇక, కుటుంబ పరంగా ఆనందానికి అవధులు లేవన్నారు. వ్యాపార సంస్కరణల విషయంలో సీఎం చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా చాలా ధైర్యసాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్టు ఎకనమిక్ టైమ్స్ పత్రిక కొనియాడింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసనీయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సీఎం చంద్రబాబు సరిగ్గా ఆ లక్షణాలను పొదివి పట్టుకున్నట్టు పేర్కొంది.
పెట్టుబడుల ఆకర్షణ, కేవలం 17 మాసాల్లోనే 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం తోపాటు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం వంటి విషయాలను పత్రిక పేర్కొంది. అదేసమయంలో ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చేయని విధంగా రైతుల నుంచి వేల ఎకరాలను భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) రూపంలో తీసుకుని.. సంస్కరణలకు పునాదులు వేశారని తెలిపింది.
ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక.. ఆయనకు వ్యాపార సంస్కర్త-2025 అవార్డును ప్రదానం చేయనునట్టు తెలిపింది. `స్టేట్ ఆఫ్ దిమేటర్: నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ బిగ్ బిజినెస్` శీర్షికతో పెద్ద కథనాన్ని ప్రచురించిన ఎకనమిక్స్ టైమ్స్.. ఆయన సాధించిన విజయాలు.. దీనికి గాను ఆయన పడిన కష్టాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates