వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు. అయితే, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇందుకు తాను భిన్నం అంటున్నారు. అంతేకాదు, తప్పు చేస్తే కొట్టండి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.

తాను పార్టీలో ఎవరికి చెడు చేయలేదని, తన వల్ల ఎవరికీ చెడు జరగలేదని అన్నారు. ఏదైనా పాయింట్ ఉంటే తన దగ్గరకు తీసుకువస్తే తాను మాట్లాడతానని చెప్పారు. అలా కాకుండా లేనిపోని అభాండాలు వేయడం సరికాదని హితవు పలికారు. అలా లేనిపోని అభాండాలు వేసి, దుస్తులు కాల్చి మీద వేసేవారికి దేహశుద్ధి చేయాల్సిందేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వారిని సెంటర్లో పడేసి కొట్టండి అంటూ పిలుపునిచ్చారు.

పార్టీ గురించిగానీ, వ్యక్తుల గురించిగానీ తప్పుగా మాట్లాడే వారిని కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా దేహశుద్ధి చేసిన వారికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. అయితే, భాష్యం ప్రవీణ్ ఏ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఈ కామెంట్లు చేశారో తెలియదు. కానీ, తనపై బురదజల్లాలనుకునే వారికి మాత్రం డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.