#AskKavitha.. కవిత కొత్త పంథా!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత.. సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఢిల్లీ లెవెల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన కవిత.. అప్పటి నుంచి ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా పార్టీతో విభేదించారు. బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రజలకు చేరువ అయ్యేందుకు కవిత తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

దీనిలో భాగంగా జన జాగృతి పేరుతో యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాల్లో పర్యటనలు వాయిదా వేసుకుని భాగ్యనగర ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తాజాగా మీడియా ముందుకు తరచుగా వస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే.. తన కుటుంబం, బీఆర్ ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వంటి అంశాలపై కూడా కవిత ప్రధానంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మేధావులు, విద్యావంతులకు చేరువ అయ్యేలా కొత్త పంథాను ఎంచుకున్నారు.

#AskKavitha అనే హ్యాష్ ట్యాగ్ ను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రాజకీయంగా అయినా, స్థానిక లేదా రాష్ట్ర సమస్యలపై అయినా తనను ఏమైనా అడిగే వారు దీనిలో అడగవచ్చన్నారు. అదేవిధంగా తాను చేస్తున్న యాత్రలు, భవిష్యత్తు ప్రణాళికలపై యువత, విద్యావంతులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. అయితే ఏ అంశమైనా సహేతుకంగా ఉండాలని కవిత సూచించారు. అనంతరం వాటికి తానే సమాధానం ఇవ్వనున్నట్టు తెలిపారు.

మొత్తంగా కవిత.. #AskKavitha ద్వారా కొత్త పంథాను ఎంచుకున్నట్టే కనిపిస్తోంది. మరి ఎంత మంది ఆమెతో కనెక్ట్ అవుతారో చూడాలి.