ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి మళ్లించగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపారు. ఈ పరిస్థితులతో ప్రయాణికులు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.
పొగమంచు ప్రభావం రాజకీయ నేతల ప్రయాణాలపై కూడా పడింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు. ఉదయం 8.30 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన ఆయన ప్రత్యేక విమానం, పొగమంచు కారణంగా గంట ఆలస్యంగా 9.30 గంటలకు టేకాఫ్ అయింది. అదే విధంగా ఢిల్లీ నుంచి తిరిగి రావాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించే విమానం కూడా ఆలస్యమైంది.
ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరగా, అక్కడి తీవ్ర పొగమంచు కారణంగా ఆయన విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. ఈ రోజు పార్లమెంట్ హౌస్‌లో కేంద్ర మంత్రులను కలవాల్సిన షెడ్యూల్‌కు ఆటంకం ఏర్పడింది. మొత్తంగా ఢిల్లీలో దాదాపు 400 విమానాలు ఆలస్యమవగా, 61 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సహా పలు విమానయాన సంస్థలు వాతావరణ ప్రభావంతో మరిన్ని ఆలస్యాలు ఉండవచ్చని ప్రయాణికులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates