ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని వారు పట్టించుకోవడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రంలో సీఎంగా ఆయన ఒకవైపు అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాను పరిగెడుతున్న వేగంతో సమానంగా పరుగులు పెట్టాలని ఆయన ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. అయితే.. వారు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు.
చంద్రబాబు వేగం కాకపోయినా.. అంతో ఇంతో అయినా వేగంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కానీ.. కొందరు మాత్రమే పనులు చేపడుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. మిగిలిన వారు మాత్రం ఎక్కడిగొంగళి అక్కడే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి వారిపై చంద్రబాబు రెండో కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, పార్టీలో కలహాలు పెట్టుకునే నాయకులు కూడా పెరుగుతున్నారు.
వారిని కూడా చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. కలహాలతో ఎన్నాళ్లు ఉంటారు..? పార్టీ కార్యక్రమాల కోసం పనిచేయాలని చెబుతున్నారు. కానీ.. నాయకులు మాత్రం కొందరు మారడం లేదు. ఇలాంటి వారిలో ఒకరిద్దరికి ఇటీవల చంద్రబాబు స్వయంగా క్లాస్ ఇచ్చారు. అయిన కూడా.. వారిలో మార్పు కనిపించడం లేదు. అయితే.. చంద్రబాబు కఠినం కఠినం అంటున్నా.. పెద్దగా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి నాయకులు లైట్ తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే నాయకులలో మార్పు అయితే పెద్దగా కనిపించడం లేదు. తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదం ఈకోవలోదే. సో.. ఇలాంటి వారు ఇప్పటి వరకు చంద్రబాబులోని ఒకకోణాన్ని మాత్రమే చూశారని అంటున్నారు. ఆయనే కనుక రెండో కోణం నుంచి ఆలోచిస్తే.. ఇప్పటికిప్పుడు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. సో.. తొలిసారి విజయం దక్కించుకున్నవారు.. ఎంతటివారైనా.. పార్టీలైన్‌ను గౌరవించాల్సిందేనన్నది గుర్తుంచుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates