ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడతలోనే రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది.
26 జిల్లాలలో 4007 కిలో మీటర్ల రోడ్లను పటిష్టపరిచే ప్రణాళికను రూపొందించగా, ‘పల్లె పండుగ 2.0’ పేరిట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే శంకుస్థాపనలు కూడా నిర్వహించారు.
క్యాబినెట్ సమావేశానికి ముందు పలువురు మంత్రులు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ నియోజకవర్గాల్లో రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండి ప్రజలు భారీ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు రహదారులు బాగుపడతాయని వారు పేర్కొన్నారు.
పవన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గంలోని 13 గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ. 18.16 కోట్లు మంజూరు చేసినందుకు మంత్రి అనిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates