కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈనెల రెండో తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సరికొత్త కార్యక్రమాన్ని లోకేష్ నేతృత్వంలో నిర్వహించారు. నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలతో ఎలా మెలగాలో సూచించారు.

ఈ రోజు కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో  ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలను కలుసుకునే ప్రతి సందర్భం తనకు ప్రత్యేకమైన సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచనలు, విజయాలు, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలు, కార్యకర్తలకు గౌరవం, అందలం వంటి అంశాలపై వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

కాఫీ తాగుతూ ముచ్చటించుకునే ఈ వినూత్న కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ అధినేత తమతో పాటు కూర్చుని మాట్లాడటం వారికి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధానాలు, గ్రామస్థాయిలో అన్ని పరిస్థితులు, మంచి చెడులు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం మంచి వేదిక అవుతుందనేది చంద్రబాబు నాయుడు భావన.