వైసీపీ అధినేత జగన్‌కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు.. జంట హత్యల కేసులో కోర్టు.. 14 రోజలు రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. మరోవైపు.. ఈ పరిణామాలపై నిశితంగా దృష్టి పెట్టి.. వెంటనే బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలని అనుకున్న జగన్‌కు కూడా షాక్ తగిలింది. ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది.
ఆది నుంచి ఇప్పటి వరకు..
పల్నాడులోని మాచర్ల, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి వంటి కీలక నియోజకవర్గాల్లో నాయకులు ఎవరు గెలిచినా.. ఆది నుంచి ఇప్పటి వరకు.. పిన్నెల్లి సోదరులదే హవా నడిచింది. కేవలం ఎమ్మెల్యేగా రామ కృష్ణారెడ్డి ఉన్నా.. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఈ జిల్లాను శాసించారన్న వాదన ఉంది. అందుకే.. తరచుగా ఇక్కడ ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పిన్నెల్లి విజయం దక్కించుకున్నారు.
ఈ పరిణామాలతో ఇతర పార్టీల తరఫున గెలిచిన వారు కూడా మౌనం పాటించిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నా.. పిన్నెల్లి వర్గం చెప్పిందే వేదం.. అన్నట్టుగా రాజకీయాలు ముందుకు సాగాయి. ఇదిలావుంటే, గత వైసీపీ హయాంలో మరింతగా ఇక్కడ రాజకీయాలు పెరిగాయన్నది వాస్తవం. కక్ష పూరిత రాజకీయాల నుంచి ఆధిపత్య రాజకీయాల ద్వారా పిన్నెల్లికి తిరుగులేకుండా పోయింది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని వేధించారన్న వాదన ఉంది.
ఈ క్రమంలోనే జవిశెట్టి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులను హత్య చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ కేసులోనే అరెస్టు అయ్యారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం రాకతో కీలక నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న పరిస్థితులను మార్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే పల్నాడులోనూ మార్పులు చోటు చేసుకుంటున్నారు. పిన్నెల్లి సోదరుల అరెస్టుతో వైసీపీకి జిల్లాపై పట్టు దాదాపు పోయిందన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates