ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. అయితే, ఆయనకు కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణను కలిగించింది. కానీ, కేసు దర్యాప్తుకు ఆయన సహకరించడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు షాకిచ్చింది.

ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు తొలగించింది. అంతేకాదు, రేపు ఉదయం 11 గంటలలోపు సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు తన బాధ్యతలలో పరిధికి మించి వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు పటిష్టంగా, సమర్థవంతంగా జరగాలని ఆదేశించింది. అయితే, దర్యాప్తు సందర్భంగా ప్రభాకర్ రావుకు హాని కలిగించవద్దని, ఫిజికల్ టార్చర్ చేయవద్దని సూచించింది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తేనే స్వదేశానికి తిరిగి వస్తానని గతంలో ప్రభాకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, దానిని హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన స్వదేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. అయితే, ఆయన విచారణకు సహకరించడం లేదని, ఐదు ఐ ఫోన్లలో రెండింటి రీసెట్ కు మాత్రమే సహకరించారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో, ప్రభాకర్ రావు రేపు లొంగిపోవాలని ఆదేశించింది.