తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయంలో జరిగిన చోరీని తేలికగా తీసుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్న ఆయన, ఇదే సంఘటన ఇస్లాం లేదా మీ మతమైన క్రైస్తవ మతాల ప్రార్థనా స్థలాల్లో జరిగినా ఇలాగే స్పందించేవారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమానమేనని, ఏ మతానికీ వేరే నిబంధనలు ఉండకూడదని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని పవన్ ఆరోపించారు. పట్టు శాలువాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు సరఫరా చేసిన కుంభకోణం సహా అనేక వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. తిరుమల పవిత్రతను భంగం చేసే అంశాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని తెలిపారు.
హిందువులు మెజారిటీ అని భావించడం ఒక భ్రమ మాత్రమేనని పవన్ అభిప్రాయపడ్డారు. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్న హిందువులు ఏకత చూపకపోతే అన్యాయాలకు గురవుతూనే ఉంటారని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణ బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, అన్ని మతాలకు సమాన గౌరవం లభించేలా సమాజం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates