అమెరికాలో ఆగని లోకేష్ వేట

పెట్టుబ‌డిదారులకు ఏపీ స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌ని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప‌ర్యటన‌లో ఉన్న మంత్రి.. పెట్టుబ‌డి దారుల‌తో అలుపెరుగ‌కుండా భేటీ అవుతున్నారు. ఐటీ స‌హా.. ఫార్మా కంపెనీల సీఈవోలు, ఆయా సంస్థ‌ల అధిప‌తుల‌తో కూడా నారా లోకేష్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తాజాగా గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌తో నారా లోకేష్ చ‌ర్చ‌లు జ‌రిపారు. సుమారు గంట సేపు పిచాయ్ సమ‌యం కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా విశాఖ‌లో ఏర్పాటు చేయ‌నున్న గూగుల్  డేటా కేంద్రంపై ఇరువురు చ‌ర్చించారు. ప్ర‌స్తుతం భూముల కేటాయింపు కొలిక్కి వ‌స్తున్న నేప‌థ్యంలో ప‌నుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఇదే విష‌యం పై మంత్రి నారా లోకేష్‌, సుంద‌ర్ పిచాయ్‌ల మ‌ధ్య చ‌ర్చ సాగింది. గూగుల్ డేటా కేంద్రంతోపాటు.. డ్రోన్ సిటీలో నూ పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఈ సంద‌ర్భంగా లోకేష్ కోరారు. అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

ఇంటెల్ సీటీవోతో కూడా..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ హార్డ్ వేర్ టెక్నాల‌జీ దిగ్గ‌జ సంస్థ ఇంటెల్ సీటీవో కె. శేష‌తోనూ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాల‌న్నారు. త‌ద్వారా.. ఏపీ ఐటీకి మరింత ప్ర‌భావ‌వంత‌మైన గుర్తింపు వ‌స్తుంద‌ని చెప్పారు. అదేవిధంగా రాజ‌ధాని ప్రాంతంలో ఏఐ ప‌రిశోధ‌న కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే, దిగ్గ‌జ సంస్థ ఎన్‌-విడియా తోనూ ఆయ‌న భేటీ అయ్యారు. అమ‌రావ‌తిలో ఎన్‌-విడియా ప్రాజెక్టును ప్రారంభించాల‌ని కోరారు.

ఇలా.. ఈ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురు దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌ను క‌లుస్తున్న మంత్రి నారా లోకేష్ వారిని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. దీనికి కొంద‌రు సానుకూలంగా స్పందిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు పంపుతున్న‌ట్టు తెలిపారు. ఏదేమైనా.. ఈ 17 మాసాల కాలంలో అంత‌ర్జాతీయంగా మంత్రి నారా లోకేష్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డంతోపాటు ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.