గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ భూములను వైసీపీ హయాంలో `ఏ-22`లో చేర్చడంతో వాటిపై హక్కులు కోల్పోయిన వేలాది మందికి ఉపశమనం కల్పిస్తూ.. తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఆయా భూములను పరిశీలించి.. వాటిని `ఏ-22` జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి లబ్ధి చూకూరడంతోపాటు.. ఇన్నాళ్లుగా వారి ఆవేదన కూడా తీరిపోనుంది.
ఏంటీ `ఏ-22`
జగన్ పాలనాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఏ-22లో చేర్చారు. తద్వారా ఆయా భూములు కలిగిన వారికి ఎలాంటి హక్కులు లేకపోగా, ప్రభుత్వానికి వారు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు, వివాదాలు వచ్చాయి. అంతేకాదు.. వైసీపీ నాయకులు కొందరు ఈ భూములపై కన్నేశారని.. వాటిని స్వాధీనం కూడా చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం కూడా వివాదంగా మారింది.
తాజాగా ఈ 5.74 లక్షల ఎకరాల భూములపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు.. ఆయా భూముల వివరాలను మరోసారి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. “ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ భూములపై విన్నపాలు వచ్చాయి. స్వయంగా నేను కూడా విన్నాను. ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఫ్రీహోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములను.. రిసర్వే చేసి.. ఆయా యజమానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోండి.“ అని చంద్రబాబు ఆదేశించారు. గతేడాది జూన్ 15 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు 5.28 లక్షల ఫిర్యాదులు కేవలం ఏ-22పైనే రావడం గమనార్హమని కూడా సీఎం అన్నారు.
దీంతో మాజీ సైనికోద్యోగులు, వైసీపీ హయాంలో కక్షపూరితంగా భూములు లాక్కున్న వారికి తాజాగా న్యాయం జరగనుంది. అదేవిధంగా ఆరు వేలకు పైగా గ్రామాల్లో రీసర్వే చేసి.. తప్పులు లేకుండా ఆయారికార్డులను అప్ గ్రేడ్ చేయాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాజా నిర్ణయాలతో వేలాది మందికి మేలు జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates