జగన్ అంటే వాళ్లలో ఇంకా భయం పోలేదా?

రాజకీయాల్లో నాయకుడి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. వీటికి తోడు సానుభూతి, గౌరవం, మర్యాద ఇవన్నీ ప్రజల నుంచి ఆటోమేటిక్‌గా రావాలి. బలవంతంగా ఎవ్వరూ ప్రజలను తమ వైపు తిప్పుకోలేరు. ఇది ప్రతి ఐదు సంవత్సరాలకోసారి స్పష్టంగా కనిపిస్తుంది. 2014లో విజయంతో వచ్చిన చంద్రబాబు 2019కి వచ్చేసరికి ప్రభుత్వాన్ని కోల్పోయారు. 2019లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ 2024లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు.

దీనిని బట్టి ప్రజల్లో విశ్వాసం అనేది సహజంగా రావాల్సిన లక్షణం. అయితే ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? తాజాగా నిర్వహించిన టిడిపి అంతర్గత సర్వేలో ఒక కీలక విషయం వెలుగుచూసింది. జగన్ అంటే ప్రజల్లో ఇంకా భయం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపించింది. దాదాపు 60 శాతం మంది జగన్ అంటే భయం అని చెప్పడం, జగన్ పాలన అంటే ఇంకా బెదిరింపులే గుర్తొస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇది అంతర్గత సర్వే అయినప్పటికీ టీడీపీకి బలం చేకూర్చేలా ఉంది. ముఖ్యంగా నాలుగు అంశాల్లో ప్రజలు జగన్ అంటే భయపడుతున్నారని సర్వే చెబుతోంది. అవి: 1) అమరావతి రాజధాని, 2) మద్యం విధానం, 3) ఎమ్మెల్యేల పనితీరు, 4) పాలనాపరమైన నిర్ణయాలు. ఏ ప్రభుత్వానికైనా ఇవే మూల స్తంభాలు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించడమే కాకుండా కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజం. కానీ గత ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిగా తోసిపుచ్చి అమరావతిని పక్కన పెట్టడం ప్రజల ఆలోచనల్లో ఇంకా మారని గాయం అయ్యింది.

ఎమ్మెల్యేల వ్యవహారం, ప్రజలతో ప్రవర్తించిన తీరు ఇప్పటికీ భయాన్నే గుర్తు చేస్తోంది. జగన్ తాడేపల్లికి పరిమితం కావడం, ప్రజలను పట్టించుకోకపోవడం, పర్యటనలప్పుడు ఆంక్షలు విధించడం వంటి విషయాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయి.

ఈ అన్నింటి వల్ల జగన్ అంటే ఒకప్పుడు ఉన్న సానుభూతి, అభిమానానికి బదులుగా భయం అనే కొత్త భావన ఏర్పడింది. దీని నుంచి బయటపడటం, ప్రజల్లో మళ్లీ సానుభూతి పొందడం జగన్ వ్యక్తిగత తీరు మీదే ఆధారపడి ఉంటుంది. లేదంటే రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించవచ్చని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి.