రాష్ట్ర స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్(జీఎస్‌డీపీ)లో వృద్ధి మరింత పెరిగినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. 2025-26 తొలి అర్ధ సంవత్సరం, 2వ త్రైమాసికం గ్రోత్ రేట్లో వృద్ధి నమోదైనట్టు వివరించారు. 2025-26 తొలి అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్)… అలాగే, 2వ త్రైమాసి(జూలై నుంచి సెప్టెంబర్)కానికి సంబంధించిన జీఎస్‌డీపీ ఫలితాలను స్వయంగా ఆయన విడుదల చేశారు. రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా 11.28 శాతం వృద్ధి నమోదైనట్టు వివరించారు.
రెండో త్రైమాసికం(ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజించగా తొలి ఆరు మాసాలు)లో రూ.4,00,377 కోట్ల విలువైన జీఎస్‌డీపీ నమోదు అయినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదే సమయానికి(గడిచిన ఆరు మాసాల్లో) దేశ జీడీపీ 8.7 శాతంగా ఉందని.. దీనిని బట్టి రాష్ట్రంలో వృద్ధి నమోదైనట్టు స్ఫష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది 2వ త్రైమాసికంలో(2024-25) రాష్ట్ర జీఎస్డీపీ 10.17 శాతంగా ఉందని, దీని విలువ రూ.3,59,778 కోట్లుగా ఉందని తెలిపారు. దీంతో పోల్చుకుంటే ప్రస్తుతం జీఎస్డీపీ 1.11 శాతం పెరిగిందన్నారు.
2వ క్వార్టర్‌కి రాష్ట్ర జీవీఏ(గ్రాస్ యాన్యువల్ వాల్యూ) 11.30 శాతం ఉండగా, జాతీయ జీవీఏ 8.7 శాతంగా నమోదైందని పేర్కొ న్నారు. రాష్ట్రంలో వ్యవసాయ-అనుబంధ రంగాల జీవీఏ 10.70 శాతం నమోదైనట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా పరిశ్రమల రంగం 12.20 శాతం, సేవల రంగం 11.30 శాతం మేరకు వృద్ధి నమోదైనట్టు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీవీఏ వృద్ధి చూస్తే వ్యవసాయ రంగం 1.8 శాతం, పరిశ్రమల రంగం 8.5 శాతం, సేవల రంగం 10.6 శాతంగా ఉందన్న ఆయన.. దేశం కంటే కూడా ఏపీలో ఆయా రంగాల వృద్ధి ఎక్కువగా ఉందన్నారు.
అయితే.. వచ్చే మూడేళ్లలో జీఎస్‌డీపీ అంచనాల మేరకు సాధించాలంటే..మరింత కృషి చేయాల్సి ఉందని వివరించారు. ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో పెట్టుబడులు మరిన్ని పెరగనున్నాయని తెలిపారు. తద్వారా.. రాష్ట్రంలో వృద్ధి మరింత గణనీయంగా పెరగనుందన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి వ్యవస్థీకృత నష్టం జరిగిందని, 2019-24లో వైసీపీ పాలన వల్ల వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. గత వైసీపీ పాలన కారణంగా గ్రోత్ రేట్(వృద్ధి రేటు) తగ్గిపోయిందని, దీనివల్ల 7 లక్షల కోట్ల రూపాయల మేరకు జీఎస్‌డీపీ కోల్పోయామని వివరించారు. 25 ఏళ్ల క్రితం చేసిన ఐటీ పాలసీ వల్ల తెలుగు వాళ్ల తలసరి ఆదాయం గరిష్టస్థాయిలో ఉందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates