కాంగ్రెస్ అగ్రనేతే కాదు.. లోక్‌సభలో విపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. తరచుగా తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్పటికప్పుడు వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నా.. ఆదిశగా ఇప్పటి వరకు అడుగులు వేయడం లేదు. తాజాగా పార్లమెంటులో కీలక చర్చ జరిగింది. అది కూడా కాంగ్రెస్ పార్టీని, తొలి ప్రధాని నెహ్రూను తప్పుబడుతూ.. చేపట్టిన వందేమాతరం చర్చను దేశవ్యాప్తంగా కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు. పార్లమెంటు సమావేశాలను తరచుగా ఎక్కువ మంది వీక్షిస్తున్నారు. సోమవారం జరిగిన వందేమాతరంపై చర్చను మరింత ఎక్కువ మంది వీక్షించారు.
ఈ చర్చను తొలుత ప్రధాని మోడీ ప్రారంభించారు. సుదీర్ఘంగా ఆయన 45 నిమిషాల పాటు ప్రసంగించారు. మధ్యలో కొన్ని కవితలు కూడా చదివారు. మరికొన్ని చలోక్తులు కూడా విసిరారు. అదేసమయంలో వేదాలు..రామాయణాన్ని, లంకా నగరాన్ని కూడా స్పృశించారు. ఇలా.. ప్రధాన మంత్రి ప్రసంగం జోరుగా సాగింది. దీనిలోనే ఆయన.. మాజీ ప్రధానులు నెహ్రూ.. ఇందిరా గాంధీ లపై విమర్శలు గుప్పించారు. మొత్తంగా ప్రధాని ప్రసంగం జోరుగానే సాగింది. తదుపరి వరుసలో ప్రధాని తర్వాత.. ప్రసంగించాల్సిన విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి అవకాశం వచ్చింది. కానీ, ఈ కీలక చర్చకు రాహుల్‌గాంధీ డుమ్మా కొట్టారు.
పోనీ.. గాంధీల కుటుంబం నుంచి ఎవరైనా పాల్గొన్నారా? అంటే.. రాహుల్‌గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు.. మాత్రమే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో వందేమాతరంపై చర్చ మంగళవారం జరగనుంది. దీంతో లోక్‌సభలో మోడీ ప్రసంగించిన తర్వాత.. రాహుల్ లేదా, ప్రియాంక గాంధీలు ప్రసంగిస్తారని అందరూ అనుకున్నారు.
కానీ.. ఇరువురు కూడా సభకు డుమ్మా కొట్టారు. ఈ విషయం రాజకీయంగా బీజేపీకి మరో అస్త్రాన్ని అందించినట్టు అయింది. “వందేమాతరానికి నెహ్రూ, ఇందిరలే కాదు.. రాహుల్ కూడా ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుస్తోంది“ అంటూ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజుజు వ్యాఖ్యానించడం గమనార్హం. సో.. మొత్తానికి కీలక సమయాల్లో రాహుల్ గాంధీ తప్పులపై తప్పులు చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates