ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే అయినా).. ఇప్పుడు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. వివాదానికి కూడా దారితీస్తోంది. ఒకే సంస్థ బీజేపీకి గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏకంగా 757 కోట్ల రూపాయ‌లను విరాళంగా ఇచ్చింది. స‌హ‌జంగానే అధికారంలోకి వ‌చ్చిన పార్టీ స‌ద‌రు సంస్థ‌కు మేలు చేయ‌కుండా ఎలా ఉంటుంది?! ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఇక‌, ఇదే సంస్థ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్‌, వైసీపీల‌కు చెరో 10 కోట్ల రూపాయ‌ల చొప్పున 20 కోట్ల‌ను విరాళంగా ఇచ్చింది.

ఎవ‌రు?

ప్ర‌ముఖ `టాటా` కంపెనీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ సంస్థ‌లో అనేక విభాగాలు ఉన్నాయి. వాహ‌నాల త‌యారీ నుంచి ఐటీ దాకా.. టాటా ఉప్పు నుంచి గార్మెంట్స్ వ‌ర‌కు.. సుమారు 20 ర‌కాల కంపెనీలు టాటాలో ఉన్నాయి. ఇవ‌న్నీ క‌లిపి.. ప్రోగ్రెసివ్ ఎల‌క్టోర‌ల్ ట్ర‌స్ట్‌(పీఈటీ)గా ఏర్ప‌డ్డాయి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా మొత్తం 10 పార్టీల‌కు ఈ ట్ర‌స్టు విరాళంగా 914 కోట్ల రూపాయ‌ల‌ను ఇచ్చింది. దీనిలో అధిక మొత్తం అంటే.. 757 కోట్ల రూపాయ‌లు ఒక్క బీజేపీకే అంద‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇక‌, కాంగ్రెస్‌కు 77.3 కోట్ల రూపాయ‌లు ఈ ట్ర‌స్ట్ ఇచ్చింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉన్న బీఆర్ ఎస్‌కు రూ.10 కోట్లు, ఏపీలో వైసీపీకి రూ.10 కోట్ల చొప్పున ఇచ్చిన టాటా.. ఇత‌ర పార్టీల‌కు కూడా ఇచ్చింది. ఈ జాబితాలో ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జ‌న‌సేన పార్టీలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. కూటమితో టాటా కంపెనీ క‌లిసి ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. విశాఖ‌లో టీసీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికిగాను ప్ర‌భుత్వం ఎక‌రా భూమిని రూ.0.99 పైస‌ల‌కే ఇచ్చింది.

ఇక‌, కాంగ్రెస్‌కు మాత్రం 77.3 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే టాటా విరాళంగా అందించింది. మొత్త‌గా చూస్తే.. ఈ విరాళాల వ‌ర‌ద‌లో  బీజేపీ భారీ ఎత్తున సొమ్ము చేసుకోవ‌డం.. దీని వెనుక ఏం జ‌రిగింద‌న్న వాద‌న ఇప్పుడు జాతీయ‌స్థాయి రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌గామారింది. ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో బుధవారం సాయంత్రం విడుద‌లైన ఈ జాబితా.. ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుందో చూడాలి.