డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. ఈ నెల 4న తెలంగాణ మంత్రులు స్వయంగా వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు దీటుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకోసం గ్లోబును చుట్టేయాలన్నంత కమిట్మెంట్ తో వ్యవహరిస్తోంది.
ఎంపీలకు, కేంద్ర మంత్రులకు, గవర్నర్లకు టీ కాంగ్రెస్ ఎంపీలు ఇన్విటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మొదలు సత్య నాదెళ్ల వంటి మేధావులు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పారు. ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధి దిశలో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. ‘తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి’ అనే నినాదంతో ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని తెలంగాణ సాధించేలా రోడ్‌మ్యాప్ ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తెలంగాణ భవిష్యత్తుకు అద్దం పట్టేలా “తెలంగాణ రైజింగ్ 2047” పేరిట రూపొందించిన డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సమ్మిట్ లో 500 కంపెనీల నుంచి 1000 మందికి పైగా డెలిగేట్లు పాల్గొనబోతున్నారు. భవిష్యత్ భారత్ కు తెలంగాణ కీలకం కానుందన్న థీమ్ తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates