ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు కట్టుకుని తిరిగారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన పదేపదే చెబుతూ ఉంటారు. తాను పర్యటనలకు వెళ్ళినప్పుడు పరదాలు, బారికేడ్ల వంటివి ఉంటే ఒప్పుకోరు. అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లను అలాగే చేస్తుంది. అదే ఆయన ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. పింఛన్ల పంపిణీకి తాను వెళ్తున్న ఊళ్లలోనే ఏర్పాట్లు బాగున్నాయని వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే.. వెలగపూడి సచివాలయం దారిలో పోలీసులు బందోబస్తు లో భాగంగా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో.. రహదారిపైకి వాహనాలు, ప్రజలు ప్రవేశించకుండా పోలీసులు ఇలా ఉంచారు. సచివాలయానికి వెళుతున్న సమయంలో వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గమనించారు. అక్కడున్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రకటనలతో కూడిన బారికేడ్లను అడ్డు పెట్టడం చూసి ఎందుకిలా చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు.
ఆ తర్వాత సచివాలయంలో ఆర్టీజీఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ అంశంపై చంద్రబాబు ప్రస్తావించారు. స్థానికంగా ఉండే పోలీసులు ట్రాఫిక్ తో పాటు ప్రజలను క్రమబద్ధీకరిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. పూర్తిగా మూసేస్తూ బారికేడ్లు పెట్టవద్దని సూచించారు. ఇక్కడికంటే తాను పింఛన్ల పంపిణీకి వెళ్తున్న ఊళ్లలోనే ఏర్పాట్లు బాగున్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయానికి వచ్చే వారికి ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన సచివాలయ అధికారులు బారికేడ్లు తొలగించి వాటి స్థానంలో పూలకుండీలు ఏర్పాటు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates