కొన్ని రోజుల కిందట కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి పరోక్షంగా గోదావరి ప్రాంతం కారణమని.. ఇక్కడి పచ్చదనం చూసి దిష్టి పెట్టారని.. అందువల్లే ఇప్పడు కోనసీమ దెబ్బ తిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వారికి ఆగ్రహం తెప్పించాయి.
తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నేతలు పవన్ మీద విరుచుకుపడుతున్నారు. అందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యంగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్నట్లుగా మాట్లాడి ఆయన పవన్‌కు కౌంటర్ వేశారు.
”ఆయనెవరయ్యా బాబూ.. సినిమాటోగ్రఫీ మంత్రంట. పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి. ఇందాక చూశా స్టేట్మెంట్. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా. రెండు మూడు రోజులు ఆడే సినిమాను ఆడనివ్వం. ఇతనెవరయ్యా బాబూ. మామూలుగా మ్యాట్నీకే ఎత్తేస్తారు అతడి సిఇమాను. తన సినిమా మార్నింగ్ షో పడితే.. మ్యాట్నీ పడడమే కష్టం. ఇతనెందుకు ఆపడం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలా ఆయన సినిమాలు. జనమే చూడట్లేదు.
ఇప్పటిదాకా ఆయన సినిమాలు కొనుక్కున్న వాళ్లు బికారులైపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇప్పటి వరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి దీని గురించి అడిగిన అధికారి ఒక్కడు లేడు. ప్రభుత్వం నుంచి ఎవ్వరూ అడగలేదు. వేరే వాడినైతే ఊరుకుంటారా అని అడుగుతున్నా. సినిమాలకు జీఎస్టీ కట్టరు. కొనుక్కున్న వాళ్లందరూ పాపర్లైపోయారు. అలాంటి వాళ్ల సినిమాను సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలా?” అని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates