ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు ఏమిటీ పురుగు..? దాని వల్ల జ్వరాలు రావడం ఏమిటి..? ఓ మహిళ మరణించింది అనే వార్తలు రావడం ఏమిటి..? అనే అంశాలపై ఏకంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. మూడేళ్ల క్రితం ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసినా స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఏపీలో వస్తున్నాయి. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదు పై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు.
చిగ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి లక్షణాలని వివరించారు. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మేరకు స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.
ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలైంది. ఈ వ్యాధి బారిన పడి విజయనగరానికి చెందిన మహిళ మృతి చెందడంతో భయాందోళనకు గురవుతున్నారు జనం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మహిళ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా ఆమెకు స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ కేసులు వందలకు చేరినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates