మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత విడదల రజిని పార్టీని వీడిపోతారంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతిసారీ తన నియోజకవర్గాన్ని మార్చడంతో కలత చెందారని, దీంతో వైసీపీకి గుడ్బై చెబుతున్నారనే కథనాలు వచ్చాయి. అయితే ఈ రోజు పల్నాడులో వైసీపీ నేతలు నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు.
తనపై వస్తున్న ఊహాగానాలపై స్పందిచలేదు కానీ.. ఎప్పటి లాగే టీడీపీపై, కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు కూడా..! దీంతో ఆమె పార్టీని వీడే ఆలోచన విరమించారా..? లేక అటువంటి ఉద్దేశమే లేదా అనే చర్చ జరుగుతోంది. గతంలోనూ రజిని పార్టీని వీడతారని మరో పార్టీలో చేరతారనే వదంతులు చాలా సార్లు వినిపించాయి.
వైసీపీ ప్రభుత్వంలో విడదల రజని ఓ కీలక నేత. అధికారంలోకి రాగానే ఆమెకు వైద్య ఆరోగ్య శాఖమంత్రిగా పదవిని జగన్ కట్టబెట్టారు. ఆ సమయంలో పలు అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. వాటిపై అధికారం కోల్పోగానే కేసులను ఎదుర్కొన్న రజిని కోర్టు ద్వారా ఊరట పొందారు. అయితే ఆమెను పదే పదే నియోజకవర్గాలు మార్చడంపైనే చర్చ జరుగుతోంది.
చిలకలూరిపేట నియోజకవర్గంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లరావుపై గెలుపొందిన రజిని మంత్రిగా ఎంపికై గుర్తింపు పొందారు. ఆ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మర్రి రాజశేఖర్ వర్గం నుంచి అసమ్మతిని కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో ఆమెను గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు. ఆ ఆదేశాలను శిరసావహించి పోటీచేసిన రజిని, ఓటమిని చవి చూశారు. ఆ తర్వాత ఆమెను తిరిగి చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ బాధ్యురాలిగా అధిష్టానం పంపింది.
కొంతకాలంగా పల్నాడులో రాజకీయాలు చేస్తున్న రజినిని హఠాత్తుగా రేపల్లె వెళ్లాల్లంటూ పార్టీ పెద్దలు సూచించారని దీంతో ఆమె మనస్తాపం చెందారని, పార్టీని వీడిపోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఆమె వాటిని కొట్టిపారేయకపోడం కూడా వాటికి బలాన్ని చేకూర్చింది.
వెను వెంటనే రజిని పల్నాడులో ఇతర నేతలతో కలిసి ప్రెస్మీట్ పెట్టడం.. ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఎవర్నీ వదిలిపెట్టబోం.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె ప్రస్తుతానికి వైసీపీలోనే ఉంటారని అంతా భావిస్తున్నారు. రజిని పార్టీని వీడిపోతారంటూ వార్తలు వస్తున్న ప్రతిసారీ.. ఆమో వాటిని ఖండించకపోవడం గమనార్హం..!
Gulte Telugu Telugu Political and Movie News Updates