పవన్ పై కాంగ్రెస్ ఫైర్… వైసీపీకి పండగే!

కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి దిష్టి తగలడం, తెలంగాణ నాయకుల పదే పదే ఇక్కడి పచ్చదనం గురించి మాట్లాడడమే కారణమని, తెలంగాణ విభజన కూడా కోనసీమ పచ్చదనం వల్లే జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్లు తెలంగాణలో రాజకీయ కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జడ్జర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని వారిద్దరూ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే పవన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ, ఆశ్చర్యకరంగా టీ కాంగ్రెస్ కంటే ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాలో పవన్ పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పవన్ పై కాంగ్రెస్ విమర్శలు చూసి పండగ చేసుకుంటున్న వైసీపీ నేతలు అది చాలదన్నట్లు తమ సోషల్ మీడియాలో పవన్ పై పనిగట్టుకొని విమర్శలు చేయిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే టీ కాంగ్రెస్ సోషల్ మీడియా కంటే వైసీపీ సోషల్ మీడియా గట్టిగా డ్యూటీ చేస్తోంది.

ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియాపై ట్రోలింగ్ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారి వైసీపీని చావుదెబ్బ తీసిన పవన్ పై వైసీపీకి ఆ మాత్రం అక్కసు ఉండడం సహజమని జనసైనికులు అంటున్నారు. అయితే, పవన్ పై ఫోకస్ చేయడం మానేయాలని, ఇప్పటికైనా జగన్ ను అసెంబ్లీకి పంపే మార్గం చూడాలని ఎదురుదాడి చేస్తున్నారు.