ఆ విష‌యంలో చంద్ర‌బాబుది 5వ స్థానం… మ‌రి ప‌వ‌న్?

దేశంలో అత్యంత ధ‌న‌వంతులైన ఎమ్మెల్యేల జాబితా, అదేస‌మ‌యంలో అతి త‌క్కువ సంప‌ద ఉన్న ఎమ్మెల్యేల జాబితాల‌ను తాజాగా ఏడీఆర్‌(అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్‌) విడుదల చేసింది. వాస్త‌వానికి ప్ర‌తి ఆరు మాసాల‌కు ఒక‌సారి ఈ జాబితాను ఈ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నారు.

అయితే.. ఆయ‌న అంద‌రి ఎమ్మెల్యేల జాబితాలో 5వ స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రిగా మాత్రం ఫ‌స్ట్ ప్లేస్‌లోనే ఉన్న‌ట్టు ఏడీఆర్ తెలిపింది. అదేస‌మ‌యంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఈ జాబితాలో చోటు సంపాయించుకోలేదు. టీడీపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇదే జాబితాలో 46వ స్థానంలో జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు.

తొలి ఐదుగురు ధ‌న‌వంతులైన ఎమ్మెల్యేలు వీరే..

1) పరాగ్ షా – మహారాష్ట్రలోని ఘట్కోపర్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే. ఈయ‌న‌ బిజెపికి చెందిన ప్ర‌జాప్ర‌తినిధి. ఈయ‌న 3318 కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నారు.

2) డీకే శివ‌కుమార్‌-క‌ర్ణాట‌క‌కు చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌. ఈయ‌న 1413 కోట్ల రూపాయ‌ల ఆస్తిని క‌లిగి ఉన్నారు.

3) కేహెచ్ పుట్ట‌స్వామి-క‌ర్ణాట‌క‌కు చెందిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీనేత‌. 1267 కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నారు.

4) ప్రియా కృష్ణ- కాంగ్రెస్ పార్టీకిచెందిన నేత‌. 1,156 కోట్ల ఆస్తితో దేశంలోనే నాలుగో ధ‌న‌వంతుడైన ఎమ్మెల్యేగా ఉన్నారు.

5) చంద్రబాబు – టీడీపీ అధినేత‌, సీఎం. ఈయ‌న ఆస్తులు 931 కోట్ల రూపాయ‌లు.(దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్య‌మంత్రి కూడా.)

ఆ ఎమ్మెల్యే ఆస్తి .. 1700 రూపాయ‌లు!

ఔను! నిజం. పశ్చిమ బెంగాల్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా స్థిరాస్తి విలువ 1700 రూపాయ‌లు. ఇంత‌కు మించి ఆయ‌న వ‌ద్ద ఆస్తులు లేవు. ఎమ్మెల్యేగా ఆయ‌న పొందే వేత‌నం పార్టీకి విరాళంగా ఇస్తున్నార‌ట‌. దీంతో దేశంలో అత్యంత త‌క్కువ ఆస్తి క‌లిగిన ఎమ్మెల్యేగా ధారా రికార్డు సృష్టించారు.  

జ‌గ‌న్ 18వ స్థానం

వైసీపీ అధినేత జ‌గ‌న్ దేశంలోని అత్యంత ధ‌నిక ఎమ్మెల్యేల్లో 18వ స్థానంలో నిలిచారు. ఈయ‌న ఆస్తి విలువ 484 కోట్ల రూపాయ‌లు.

ప‌వ‌న్ 46వ స్థానం

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ జాబితాలో 46వ స్థానంలో ఉన్నారు. మొత్తం ఆస్తి 70 కోట్ల రూపాయ‌ల లోపేన‌ని ఏడీఆర్ తెలిపింది.