వైసీపీలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీ నేతలపై పట్టుకోల్పోవడంతో పాటు, కార్యకర్తలపై కూడా జగన్ నియంత్రణ కోల్పోతున్నారని చెబుతున్నారు. దీంతో కొత్త కొత్త సమస్యలు తెరమీదికి వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. తాజాగా జగన్ క్షమాపణలు చెప్పాలంటూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కేరళ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఏం జరిగింది?
హిందూ భక్తులు పరమపవిత్రంగా భావించే అయ్యప్ప స్వామి ఆరాధన, దీక్ష స్వీకరణ అందరికీ తెలిసిందే. చిన్నా పెద్దా అందరూ ఈ మాల ధరించి కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దర్శిస్తారు. ఇది ఎప్పటికీ రాజకీయాలకు అతీతం. ఎవరూ ఈ భక్తి సంప్రదాయాన్ని రాజకీయాల్లోకి లాగలేకపోయారు. గతంలో బీజేపీ ప్రయత్నించినప్పుడు కూడా తీవ్ర ప్రతికూలతను చవిచూసింది.
కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొందరు అయ్యప్ప దీక్షను, శబరిమల యాత్రను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు కానీ పదేపదే ఇదే చేయడం ఎవరికైనా ఇబ్బంది కలిగించే పని.
గత వారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటకు చెందిన కొందరు వైసీపీ మద్దతుదారులు అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో పంబా నది ఒడ్డున ‘జగన్ 2.0’ బేనర్లు పెట్టి జై జగన్ నినాదాలు చేశారు. దీనిపై అప్పుడే విమర్శలు వచ్చాయి.
అప్పట్లోనే జగన్ స్పందించి ఇలా చేయొద్దని చెప్పి ఉండి ఉంటే సమస్య ఇంతవరకు రాకపోయేది. కానీ ఆయన స్పందించకపోవడం వల్ల ఇప్పుడు పెందుర్తి సహా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన భక్తులు కూడా ఇలాంటి బ్యానర్లు ప్రదర్శించారు.
దీంతో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ కేరళ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. అయ్యప్ప స్వామివారికి ఇది అవమానం అని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే శబరిమల ప్రవేశం కూడా ఆపేస్తామని హెచ్చరించారు.
ఈ వివాదం మరింత ముదరకముందే జగన్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates