వివాదంలో ఏపీ మంత్రి.. ఏం జరిగింది?

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుమారుడు, అదేవిధంగా ఆమె ప్రైవేటు వ్యక్తిగత కార్యదర్శిగా చెబుతున్న సతీష్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, వేరే వ్యక్తులతో ఉండాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారనీ ఆమె గత నాలుగు రోజులుగా మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

కానీ మంత్రి గారి కుమారుడి కేసు కావడంతో పోలీసులు దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. మంత్రి పీఏను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడం తో పాటు, బాధితురాలిపై కూడా కేసు పెట్టి విచారించాలని ఆదేశించింది. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆమెపైనే చర్యలు తీసుకోవాలని సూచించింది.

విషయం ఏంటి?

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ భర్త కరోనా సమయంలో మరణించారు. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి. ఈ క్రమంలో కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం ఆమె ప్రయత్నించినప్పుడు మంత్రి పీఏ సతీష్ పరిచయం అయి, ఆమె నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితురాలు చెబుతున్నారు.

మొత్తానికి ఉద్యోగం వచ్చింది. కానీ తర్వాత అధికారులు, తోటి సిబ్బంది నుంచి సదరు మొత్తం ఎవరు తీసుకోలేదని, సతీషే తీసుకుని ఉంటాడని ఆమెకు చెప్పారు. దీంతో ఆమె నేరుగా సతీష్‌ను సంప్రదించి, తన సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మంత్రి కుమారుడు పృథ్వీ ఎంటర్ అయ్యారు. ఆయన సెటిల్ చేస్తానని చెప్పినట్టు బాధితురాలు చెబుతున్నారు.

తర్వాత సెటిల్ చేయకపోవడంతో పాటు, తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, తన ఫ్రెండ్స్‌తో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారనీ బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు గత నాలుగైదు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. తాజాగా ప్రభుత్వం దీనిపై చర్యలకు ఆదేశించింది.