మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలక తీరిందా? తిరిగి ఆయన సాధారణ స్థితిలోకి వచ్చారా? ఇక రాజకీయాలను యాక్టివ్ చేయనున్నారా? అంటే ఔనే అనే సమాధానే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పట్టుబట్టి భీమిలి నుంచి విజయం దక్కించుకున్న గంటా మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నించారు. కానీ అనివార్య కారణాలతో విశాఖకు చెందిన చాలా మంది నాయకులకు పదవులు చిక్కలేదు. దీంతో ఒకరిద్దరికి వేరే పదవులు లభించాయి.
ఈ నేపథ్యంతో సహజంగానే తన ఇమేజ్‌కు తగిన విధంగా ఎలాంటి పదవీ దక్కకపోవడంతో గంటా అలిగారు. దీనికి తోడు స్థానికంగా చోటుచేసుకున్న కొన్ని వివాదాలు, రాజకీయ ప్రమేయాలు కూడా ఆయనను కలవరపరిచాయి. తనకు వ్యతిరేకంగా కూటమిలోని మరో పార్టీ నాయకుడు ఫిర్యాదులు చేయడం, దీనిపై తనకు మద్దతు ఇచ్చేవారు కనిపించకపోవడంతో ఇబ్బందులు వచ్చాయి. ఇది గంటాను ఇబ్బందులకు గురి చేసింది. ఫలితంగా ఆయన మౌనం పాటిస్తూ వచ్చారు.
అయితే ఇటీవల గూగుల్ డేటా కేంద్రం ఏపీకి వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో ఇప్పటికే అనేక పరిశ్రమలు రావడంతో పాటు గూగుల్ డేటా కేంద్రానికి ఏకంగా 588 ఎకరాలు ఇవ్వాల్సిరావడంతో ప్రభుత్వం డోలాయమానంలో పడింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న మాజీ మంత్రి గంటా తన భీమిలి పరిధిలోని రెండు ప్రాంతాల్లో 160 ఎకరాలు ఒకచోట, మరో 160 ఎకరాలు మరోచోట ఇప్పించేందుకు రెడీ అయ్యారు.
స్థానికులతోను, రైతులతోను పలుదఫాలుగా చర్చించారు. గంటా మాట, ఆయన ఇచ్చిన హామీలకు ఫిదా అయిన రైతులు భూములు ఇవ్వేందుకు ముందుకు వచ్చారు. వీరికి తాజాగా పరిహారం కూడా ఇస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం 320 ఎకరాల మేరకు భూములు సమకూర్చి పెట్టడంతో గంటాకు సీఎం చంద్రబాబు నుంచి అభినందనలు అందాయి.
దీంతో ఇప్పటివరకు గంటా పడ్డ నిరాశ, చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదన్న వాదన తెరమరుగైంది. పైగా బాబు త్వరలోనే వచ్చి తనను కలుసుకోవాలని చెప్పడంతో గంటా అలక మటమాయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates