‘పరదాలో పవన్’ అంటున్న వైసీపీకి జనసేన కౌంటర్

పరదాల మాటున పవన్ కళ్యాణ్ టూర్లు అంటూ… వైసిపి చేస్తున్న ఆరోపణలను జనసేన పార్టీ తిప్పి కొట్టింది. పీ అంటే పరదాలు, కే అంటే కంచెలు అని వైసీపీ విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో పరదాలు, కంచెలతో ప్రజలెవరూ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పకుండా ఆంక్షలు.. ఒకవేళ చెప్పడానికి వస్తే… మైక్ కట్..! చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ప్రజా సమస్యలు వినడానికి కూడా ఇంత భయం ఎందుకు? అంటూ ఆ పార్టీ ప్రశ్నించింది. పవన్ పర్యటనలో పరదాలు కట్టిన ఫోటోలను విడుదల చేసింది. 

దీనికి జనసేన ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. తమరు పెట్టిన మొదటి ఫోటోకి సంబంధించిన వీడియో ఇది.. అంటూ పోస్ట్ చేసింది. ఆ పరదా వెనుక ఉన్న గృహంలోని గృహిణి బయటకొచ్చి ప్రభుత్వం తమకి కల్పించిన మ్యాజిక్ డ్రెయిన్ సౌకర్యం గురించి ఉపముఖ్యమంత్రికి నవ్వుతూ సంతోషంగా కృతజ్ఞతలు తెలిపిందని వివరించింది. మీ తరహా పరదాల వాడకం కాదు ఇది.. అంటూ సెటైర్లు వేసింది. 

ఇక రెండో ఫోటోలోని కంచె పార్టీ కేంద్ర కార్యాలయం బయట ఉన్న గేటును ఆనుకుని ఉన్నది. అంటే తమ మాదిరి క్యాంపు కార్యాలయానికి పెద్ద పెద్ద బోనులు కడితే అక్షేపణీయం కానీ గేటుకి ఆనుకుని కంచె ఉంటే తప్పేముంది! అని ప్రశ్నించింది. అసలంటూ జగన్ పాలన వెలగబెట్టిన ఐదేళ్లలో ప్రజలను కలవడం, వారి సమస్యలు వినడం లాంటివి చేస్తే ఇవి అర్థమయ్యేవి అని జనసేన పేర్కొంది. దీనిలో మిమ్మల్ని నిందించడం కూడా సమంజసం కాదులే.. పాపం మీరేం చేస్తారు!! అంటూ ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది.