కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉందన్నారు. అమరావతి రాజధానిలో ఒకే విడత 15 బ్యాంకులు, ఇతర బీమా కంపెనీలకు చెందిన కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు.
రాజధాని అమరావతిపై ప్రజలకు అనేక ఆశలు ఉన్నాయని పవన్ చెప్పారు. ఒకేచోట బ్యాంకులు, బీమా కంపెనీల కార్యాలయాల నిర్మాణంతో రాజధానికి కొత్త కళ వచ్చినట్టు అయిందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ప్రధానంగా తీసుకుని పనిచేస్తోందన్నారు. జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తున్నామని తెలిపారు. ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయటం శుభసూచకమని పేర్కొన్నారు.
బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదు అని పేర్కొన్న పవన్ కల్యాణ్.. దానిని అమరావతి సాధించిందని తెలిపారు. ఈ కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం ఆర్ధికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. 13 వందల 34 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్ధిక భవిష్యత్ నిర్మాణానికి కీలకమని ఉద్ఘాటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అది కూడా ల్యాండ్ పూలింగ్‌లో ఇవ్వడం విశేషమని పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణం కోసం కేంద్రం ఎంతో సహకరిస్తోందని తెలిపారు. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టేందుకు కూడా కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అడుగడుగునా ఆదుకుంటున్న ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates