భారత్, నేపాల్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, సరిహద్దు గొడవలు అప్పుడప్పుడు రాజుకుంటూనే ఉంటాయి. ఇన్నాళ్లు కేవలం మాటల యుద్ధంగా, రాజకీయ మ్యాపులకే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు ప్రజల జేబుల్లోకి కూడా వచ్చేసింది. నేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వేడిని పెంచేలా ఉంది. ఒక చిన్న కాగితం ముక్క ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
సాధారణంగా ఏ దేశమైనా తమ కరెన్సీ నోట్ల మీద తమ దేశ గొప్పతనాన్ని లేదా చిహ్నాలను ముద్రిస్తుంది. కానీ నేపాల్ మాత్రం ఒక అడుగు ముందుకేసి, ఇండియాకు చెందిన ప్రాంతాలను తమవిగా చూపిస్తూ కొత్త కరెన్సీని రిలీజ్ చేసింది. ఇది పక్కాగా ఇండియాను ఇరిటేట్ చేసే చర్యే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ నోటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు విషయానికి వస్తే.. నేపాల్ ప్రభుత్వం కొత్తగా 100 రూపాయల నోట్లను విడుదల చేసింది. ఇందులో ముద్రించిన నేపాల్ మ్యాప్ లో భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపించింది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (NRB) ఈ కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చింది. ఇందులో మాజీ గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకం, జారీ చేసిన తేదీ కూడా ఉంది.
ఈ వివాదం ఈనాటిది కాదు. 2020 మే నెలలో కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ మూడు ప్రాంతాలను కలుపుకుని కొత్త రాజకీయ మ్యాప్ ను ఆమోదించింది. ఇప్పుడు దాన్ని అధికారికంగా కరెన్సీపై ముద్రించింది. విచిత్రం ఏంటంటే.. రూ. 10, 50, 500 వంటి నోట్లు ఉన్నా, కేవలం రూ. 100 నోటు మీద మాత్రమే నేపాల్ మ్యాప్ ఉంటుంది. అందుకే ఈ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేపాల్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వాస్తవాలను మార్చలేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే తేల్చిచెప్పారు. నోటు మీద మ్యాప్ మార్చినంత మాత్రాన, గ్రౌండ్ లెవల్ లో ఇండియా భూభాగం నేపాల్ ది అయిపోదు కదా అని భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సరిహద్దు చర్చలు జరుగుతుండగా ఇలాంటి పనులు చేయడం సరికాదని భారత్ వాదన.
సిక్కిం, బెంగాల్, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో కలుపుకుని దాదాపు 1,850 కిలోమీటర్ల మేర భారత్ నేపాల్ సరిహద్దు ఉంది. ఇలాంటి సున్నితమైన సమయంలో నేపాల్ చేసిన ఈ ‘కరెన్సీ రాజకీయం’ భవిష్యత్తులో రెండు దేశాల బంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆ కొత్త నోటు సరిహద్దుల్లో కొత్త చిచ్చు రేపేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates