రాష్ట్ర విభజనకు కోనసీమ పచ్చదనం కూడా కారణమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పులను సరిచేస్తున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తాజాగా కోనసీమ జిల్లా రాజోలులో నిర్వహించిన పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మొదట కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం, కేశనపల్లి సహా రెండు మండలాల్లోని కొబ్బరి తోటల్లో పర్యటించారు. రైతులను కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొబ్బరి తోటలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం చేయని తప్పు లేదని, వాటిని సరిచేయడానికే సమయం సరిపోవడం లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెబితే యువత నమ్మరని అన్నారు.
రాష్ట్ర విభజనకు కోనసీమ కొబ్బరి చెట్లు కూడా ఒక కారణమని పవన్ వ్యాఖ్యానించారు. కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందన్నారు. సంక్రాంతి తర్వాత కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
కోనసీమ రైతుల సమస్యలను కేంద్రానికి వినిపించేందుకు కృషి చేస్తానని, రైతుల గొంతుకనవుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కోనసీమ రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, కేవలం కొంత సొమ్మును ఇచ్చి వెళ్లేందుకు తాను ఇక్కడకు రాలేదని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు.
శంకరగుప్తం రైతుల సమస్యలను చాలా దగ్గరగా చూశానని, వారిని ఆదుకుంటామని తెలిపారు.
వరాలు ఇచ్చేందుకు తాను ముఖ్యమంత్రి స్థాయిలో లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. భారీ నిధులు తీసుకురావాలంటే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదని చెప్పారు. అయినా సీఎం చంద్రబాబు చాలా ఉదారంగా నిధులు కేటాయిస్తున్నారని పవన్ తెలిపారు.
గత పాలకులు చేసిన నష్టాన్ని భర్తీ చేసేందుకు సీఎం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. గతంలోనే ఈ సమస్యలు పట్టు చేసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేదేం కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates