రప్పా రప్పా అంటే నరకడం కాదట

రప్పా రప్పా డైలాగ్ ఇపుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మారు మోగిపోతుంది. ఈ పుష్ప సినిమా డైలాగ్ ని ప్లకార్డుల్లో ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కొందరు. అలా ఒకరు జైలుపాలు కూడా అయ్యారు. ఈమధ్య జగన్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఈ డైలాగ్ తో కొందరు ప్రదర్శన చేయడం విమర్శల పాలయ్యింది.

దీనిపై గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు రప్పా.. రప్పా అంటే నరకడం కాదంటూ కొత్త అర్ధం చెప్పారు. రప్పారప్పా అంటే రెపరెపలాడుతూ మళ్లీ వస్తామని అర్థం అన్నారు. జగన్ కు వస్తున్న ఆదరణ చూసిన కొందరు ఈ డైలాగుపై రచ్చ రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. 

సందర్భమేదైనా.. రప్పా రప్పానే! 

సమయం, సందర్భం ఏదైనా సరే, వైసీపీ శ్రేణుల దూకుడు మారలేదని టిడిపి విమర్శ చేస్తోంది. మాజీ సీఎం జగన్ పర్యటనలంటే చాలు.. నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు అంటోంది. జగన్ శుభకార్యాలకు వెళ్ళిన సమయంలోనూ ఇటువంటి పోస్టర్లను ప్రదర్శించడం గమనార్హం.

గతంలో వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో రప్పా రప్పా డైలాగ్ పై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అది ఒక సినిమా డైలాగు అంటూ కొట్టి పారేశారు. దానిని ఖండించకపోగా, తమ కార్యకర్తలను సమర్ధించటం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. రప్పా రప్ప అంటే.. రెపరెపలాడటం అంటూ కొత్త భాష్యం చెప్పారు.